Sunday, July 10, 2011

మానస సరోవరం - వర్ణం ...!!!



ధారలా మొదలయ్యింది
ధీరలా సాగుతోంది
నిశ్చల తటాకంలా
నిరంతర జీవనవాహినిలా.....


నా గమనం- అంబరమంత అనంతం
సంద్రమంత నిగూఢం
గిరులంత గంభీరం
నిరంతర ప్రకృతి చైతన్యరూపం

నా గమనవర్ణ కొలమానం- విధివశాన ఎదురయ్యే ఆపదలు
వాటికి కాలాతీత పరిష్కారాలు
తలవకనే పలుకరించే లాస్యానుభవాలు
వీడ్కోలు గుర్తుగా వాటి సుందర ఙ్ఞాపకాలు

పాలుగారే శైశవప్రాయపు చిరునగవు తలచినా
ముదిమే అలంకారంగా ప్రశాంత ఙ్ఞానసంభూత వదనం కన్నా
పంకం ఎంచక పద్మాలను మాత్రమే చూడగల స్నేహసాంగత్యం ఉన్నా
అలల నా మోము హరివిల్లులా ప్రతీ వర్ణాన్ని ఇముడ్చుకున్న గోమేధికం

వేకువ ఆశ నిశీధి నిరాశను అస్తమింపజేయాలని బయలుదేరినా
ప్రకృతి తాండవ పీడిత సంఘర్షణల విలయం విన్నా
దాహార్తితో దరిచేరే అనామక బంధాలు పెనవేసుకున్నా
ఉప్పొంగే కరుణ పయోనిధి గర్భాన ఉద్భవించే మేలిముత్యం

బంధాల వనాల మధ్య నా సంతస బిందువులు తరువులని తాకినా
బదులుగా వారు పలికే చలన దరహాసపు జీవనరాగం విన్నా
నా ఉరుకుల అలలపై వారి సంతోషం ప్రతిబింబించాలన్నా
నా వర్ణం పచ్చని భావాలతో పొదిగిన పచ్చల పతకం

తెలియక చేసిన తప్పు తలవని తలంపుగా అడ్డం పడినా
తప్పుకి సాక్ష్యం అయ్యీ, ధైర్యం ఉండీ చేవచచ్చే పరిస్థుతులన్నా
సకారణం ఉన్నా ప్రశ్నించే అర్హత లేని వారు ఎదురైనా
ఇంకుతూ కుంచించుకుపోయే నేను యామినిలా నీలం

అహంకారమే భూషణంగా కలుషితమే ధ్యేయంగా దరిచేరినా
శిలలా కదలలేని తామసికమైన బుద్ధికలవారైనా
హక్కుల విల్లు ఎక్కుపెట్టి నాపై కాని భాధ్యతలు సంధించినా
క్రోధంతో జ్వలిస్తూ కుంకుమ వర్ణం దాల్చిన నేను అరుణ మాణిక్యం

ఆదిత్యునికన్నా ముందే నను చేరి పలుకరించే కిలకిలల విహంగాలన్నా
మరులుగొలిపే నగవు విందులు మోసుకొచ్చే చెలుల సందడున్నా
సంకట సమయాన చుక్కానియై నను నడిపించగల సమీరాలన్నా
దీపశోభిత మానసియైన నా వర్ణం పుష్యరాగం

ఆభిజాత్యం ఉనికే ఎరుగని తొణకని నిండుకుండ వంటి మరాళమైనా
వర్ణాన్నికాక సౌదామినిని ఎంచగల అంతర్నేత్రులైనా
అనవతర పయనానికి ఊపిరులూదే శ్రావణమేఘమన్నా
ఆశావాదంతో వెలిగే నా నగుమోము వైఢూర్యం

ఎంతదూరాన ఉన్నా నన్నాహ్వానించే హృదయ సముద్రం అన్నా
నా రాకకై ఎదురుచూస్తూ ఆలాపించే ఆ సాగరఘోష విన్నా
గంభీర వదనుడైన అ గుణరత్నాలరాశిని కన్నా
ఉత్కృష్టతకు ఉదాహృతియైన ఆ మనసుముందు నా చెక్కిలి పగడం

ఆటుపోట్లు ఎదురైనా అవి నిలువలేని నీరదాలే
కాలం తనతో మోసుకొచ్చే ప్రతీ అనుభవం నాలో జీవనబిందువే
ఎదురొచ్చే ప్రతివారు నా గమనానికి వర్ణాలద్దే స్నేహగీతాలే
ఏ భావమైనా తామరాకుపై నీటిబొట్టులా మారిన క్షణం-
......ఏ వర్ణమూ అంటజాలని నా వర్ణం నిత్య వజ్రశోభితయే !!!!!!!!

4 comments: