Saturday, March 5, 2011

వర్షపు చినుకులు . . ! ! !



నయన ద్వయ ద్వారబంధాలు తొలగినంతనే నేత్రాలు ఆనంద పరవశులయ్యాయి
కారణం నీలిమేఘాలు తామసి వర్ణం పులుముకుని కారుమబ్బులయ్యాయి
అంతలో నా ప్రియనేస్తాలు అంబరవీధిలోనుండి ముత్యాల చినుకులుగా రాలుతున్నారు
ఆత్రంగా నన్ను తాకుతూ కుశలం అడుగుతూ చిరునవ్వుతో పలుకరిస్తున్నారు
ఆలస్యానికి కారణాలు వెతుకుతూ ఆటపట్టిస్తున్నారు

అంత ఆనందంలోను వైరం ఉనికిని తెలియపరుస్తున్నదెవరో తెలుసా ???
గొడుగు అడ్డుగా ఆ అందమైన పలకరింపుని తృణీకరిస్తున్నవారు
అంత అవమానంలోను నా కోసమే భూమ్యాకాశాల నడుమ వారధి కడుతున్నారు
నిలువజాలని ఆ వారధి మీదే ఆనందసాగరాలని తరలిస్తున్నారు
దివి ఎక్కడో లేదు, తమలోను, తమని చూసే నా కళ్ళలోను ఉందన్నారు

ఆ అనంతమైన అనుభూతిని ఆస్వాదిస్తున్న అదృష్టం నాదే అనుకున్నా
కాదు కాదు.. మాది కూడా అంటూ మౌనంగా చాటుతున్నారు పాదపాలు
ఆలోచనా తరంగాలతో ఆనందాన్ని వెలువరిస్తున్న నాకు, తీవ్ర పోటీ ఆ భూరుహాలు
వయ్యారంగా నాట్యం చేస్తూ తరువులు చల్లని సమీరాలని సమీకరిస్తున్నారు
మమ్ము మరిచారా అంటూ కినుక అలుక ఉమ్మడిగా అరువు తెచ్చుకున్నారు

తృణీకరిస్తున్నవారిపై జాలిపడుతూ, మా ఆహ్వానానికి అంగీకరిస్తూ
మా రాక మీ కోసమే అన్నట్లుగా మా ఉమ్మడి నెయ్యాలు వస్తున్నారు
మేఘమాలల నడుమ నుండి ముత్యాలు గా విడిపడుతూ మమ్మల్ని తడిపేస్తున్నారు
ఈ మట్టి మరియు మా మనసులని పులకరింపజేస్తూనే ఉన్నారు
అవే నా ఇష్టాలు, సంతోషాలు, స్నేహాలు.... నా వర్షపుచినుకులు ! ! !


ఇది హాస్టల్ గదిలో ఒక సాయం సంధ్య వేళ, వర్షం కదిల్చిన నా మనసునుండి వెల్లువెత్తిన భావాలు.
ఒక్క విషయంలో మాత్రం ఎప్పుడూ ఎవరి మాట వినే ప్రశ్నే లేదు.... అదే వర్షం !!!
అది కదిపిన ఙ్ఞాపకాల దొంతరలో, కాగితపు పడవలు చేసి ఆనందించడం నుంచి ఎవరికీ దొరకకుండా ఇంటి పైకెళ్ళి వానకి ఆహ్వానం పలకడం వరకు ఎన్నో మధురానుభూతులు. అందులోనుండి ఒక మరపురాని ఙ్ఞాపకం......

ఏడేళ్ళ వయసులో ఉన్నప్పుడు మా స్కూల్ ఇంటికి చాలా దగ్గర. రోజూ ఇంటికి తీసుకెళ్ళడానికి పని చేసే ఒక అమ్మాయి వచ్చేది. స్కూల్ విడిచే సమయంలో వర్షం పడుతోంది, నాకేమో పిచ్చి ఆనందం, ఎందుకంటే అలాంటి సందర్భాలలోనే తడవడానికి నాకు పూర్తి స్వేచ్ఛ , అవకాశం మరి. ఆ అమ్మాయి గొడుగు తెస్తుందని దొరకకుండా రోజూ వెళ్ళే వెనక గేట్ కాకుండా మెయిన్ గేట్ నుండి పరుగు.
పొరపాటున దారిలో ఎదురుపడతానన్న భయంతో వేరే దారిలో వర్షంలో తడుస్తూ గెలిచానన్న విజయగర్వంతో ప్రయాణం. నా వర్షం వచ్చి ఏదో వాళ్ళ సొమ్మంతా దోచుకెళ్తుందన్నట్లుగా దారిలో అందరూ షాపుల్లోను, చెట్ల కింద దాక్కుంటున్నారు .
వారిపై జాలి పడుతూ ఆ చినుకులన్నీ నాకే అనే సంతోషంలో నేను :)
అంతలో ఢాం... ఢాం...
చేతిలో పెద్ద టవల్ పట్టుకుని ఎదురుగా వస్తోంది ...... అమ్మ !!!!!!
అసలు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి నేను కనపడలేదని చెప్పేంత సమయం కూడా కాలేదు. అయినా ముందే నేను అలా చేస్తానని కనిపెట్టేసింది. గొడుగు లేదనుకుంటా, తడుచుకుంటూనే వస్తోంది. నాకు చాలా ఆశ్చర్యం ఇంకా కోపం.........
వచ్చేసి, ఆ టవల్ లో నన్ను పూర్తిగా చుట్టేసి, నా మొహం చూసి, నా ఎత్తులు కనిపెట్టేసానని నవ్వుతూ, నన్నెత్తుకుని ఇంటికి బయలుదేరింది.
విచిత్రంగా ఆ క్షణం స్వేచ్చగా వర్షంలో తడుస్తున్నప్పుడు ఉన్న ఆనందం కంటే లెక్కలేనన్ని రెట్లు సంతోషం అమ్మని హత్తుకుని బందీ గా ఉన్నప్పుడు అనిపించి, నా కోపం అంతా ఎగిరిపోయింది :)

2 comments:

  1. మీ చిన్న నాటి మధురానుభూతి చాలా బాగుంది ! వర్షంలో తడిసిన ఆనందానికి అంత కంటే అందమైన ముగింపు ఉండదేమో !

    ReplyDelete